మీరు నిర్ణయం తీసుకుంటారా..? మేం తీసుకోవాలా…?
Supreme Court serious about Telangana Speaker:ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మీరు నిర్ణయం తీసుకుంటారా..? మేం తీసుకోవాలా…? అంటూ తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యానిస్తూ ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టుధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని వ్యాఖ్యానించారు. దీంతో నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి కోర్టుకు చెప్పారు.
‘ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే స్పీకర్ కోర్టు ధిక్కారణకు సిద్ధం కావాలి. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని మేం ముందే చెప్పాం.. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి.’ అంటూ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా పిటిషన్ పై ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్.. నాలుగు వారాల్లో మ్యాటర్ వింటాం అంటూ చెప్పారు జులై 31,2025న అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా కేటీఆర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.