ఆడబిడ్డలందరికీ సారె : రేవంత్ రెడ్డి
One crore sarees distribution program:తెలంగాణ(Telangana)లోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చెప్పారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలను అందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈరోజు నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం 9 వ తేదీ డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ కార్యక్రమం చేపడతారని చెప్పారు. మార్చి 1 నుంచి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు. ఆడబిడ్డలకు సారె పెట్టాలన్న ఆలోచనతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఆయన జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్యల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చీరల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టంగా చెప్పారు. అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిర్దేశించిన గడువులోగా విడతల వారిగా పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వండని ఆదేశించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించి ఈ కార్యక్రమ బాధ్యతలను అప్పగించాలన్నారు. చీరల పంపిణీ విషయంలో ఎలాంటి లోటుపాట్లు చూడాలన్నారు. కుల గణన సందర్భంగా సేకరించిన వివరాల డేటా కలెక్టర్ల వద్ద ఉంది. ఫేషియల్ రికగ్నిషన్‌తో పాటు ఆధార్ నంబర్ నమోదు చేసుకుని ఎక్కడా తప్పులు జరక్కుండా పారదర్శకంగా పంపిణీ కార్యక్రమం జరగాలని ఆదేశించారు.