కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో సింగరేణి సీఎండీ
నీతి ఆయోగ్ నియమించిన పలు ఖనిజ పరిశ్రమలలో సింగరేణికి అగ్రస్థానం
దేశంలో ఉన్న కీలక ఖనిజాలను గుర్తించడం, అన్వేషణ, ఉత్పత్తి కోసం ఒక జాతీయ స్థాయి కమిటీ నియమించారు. కమిటీకి ఛైర్మన్ గా ఐఐటి- ఐఎస్ఎం సంస్థ అడ్వైజర్ (మినరల్స్) డాక్టర్ డీకే సింగ్, కమిటీ సభ్యులుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ (ఐ.ఎం.ఎం.టి) డైరెక్టర్, సింగరేణి సంస్థ ఛైర్మన్ తో పాటు నైవేలీ లిగ్నైట్ కంపెనీ, కోల్ ఇండియా, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల ఛైర్మన్లు పలు పరిశ్రమల విభాగాల నుండి మరో ఆరుగురిని సభ్యులుగా నియమించారు.
21వ దశాబ్దంలో కీలక ఖనిజాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్లలోనూ, గనుల్లోనూ, థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్, బాటమ్ యాష్ లోనూ, బొగ్గు సీముల్లో ఉన్న కనీసం 10 రకాల కీలక ఖనిజాలను గుర్తించనున్నారు. దేశంలో కనీసం 20 ప్రదేశాలలో ఉన్న కీలక ఖనిజాల ఉనికి తెలుసుకొని సత్వరమే అక్కడి శాంపిల్స్ ని పరిశీలిస్తారు. వాటిపై అన్వేషణ జరపడం, ఉత్పత్తి అవకాశాలను పరిశీలించడం వంటివి ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అధ్యయన నివేదిక ఏడాదిలోగా సమర్పించాలని నీతిఆయోగ్ పేర్కొంది.
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరింత ప్రోత్సహించే విధంగా ఈ కమిటీ చురుకుగా పనిచేయాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. కీలక ఖనిజాల లభ్యత, విస్తరణ ఎంత ఉంది అనేది గుర్తించి, అనంతరం శాంపిల్ అనాలసిస్ జరిపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కీలక ఖనిజాల ఉనికి నిర్ధారిస్తే, పరిశ్రమలు సొంతగా కానీ లేదా ఉమ్మడి భాగస్వామ్యంతో, ఇతరులతో కలిసి గాని ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి సంపూర్ణ నివేదికను 12 నెలల లోగా సమర్పించమని నీతి ఆయోగ్ కోరింది.
సింగరేణి సంస్థ ఇప్పటికే కీలక ఖనిజాల (Critical Minerals) రంగంలో దూకుడుగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో, సింగరేణి సీఎండీని జాతీయ కీలక ఖనిజాల కమిటీలో సభ్యునిగా నియమించారు. కీలక ఖనిజాల అన్వేషణ, అధ్యయనం, భవిష్యత్ అవసరాల అంచనా, మరియు వ్యూహాత్మక ప్రణాళికల విషయంలో సింగరేణి సంస్థ చురుకుదనం, ముందడుగు చూపినందువల్లే ఈ ప్రాధాన్యత లభించినట్లు భావిస్తున్నారు. దేశ కీలక ఖనిజ ప్రణాళికలను వేగవంతం చేయడంలో, స్వదేశీ వనరుల అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో సింగరేణి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నియామకం సంస్థ ప్రతిష్టను మరింత పెంచనుంది.