పాపను బలి తీసుకుందెవరు..?
-దండేపల్లి మండలం నంబాలలో బాలిక దారుణ హత్య
-బావిలో మృతదేహం లభ్యం
The brutal murder of the girl:అభం.. శుభం తెలియని చిన్నారి… రెండు రోజులుగా కనిపించడం లేదు… దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు సైతం చేపట్టారు… అయితే అది కాస్తా విషాదంగా మారింది… ఆ చిన్నారి బావిలో శవమై తేలింది…
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహన్విత (7 సంవత్సరాలు) అనే బాలిక సోమవారం రాత్రి తోటి పిల్లలతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటోంది. మిగతా పిల్లలంతా ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోగా, మహన్విత వెళ్లలేదు. దీంతో ఆమె తండ్రి శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆ బాలిక మృతదేహం బావిలో లభ్యం అయ్యింది. బాలికను హత్య చేసి బండ కట్టి బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే మంచిర్యాల ఏసిపి ప్రకాశ్, సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్‌ఐ తహసీనుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆ పాపను బలి తీసుకున్నదెవరు..? ఏం జరిగింది…? హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.. చివరకు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు.