ఒక్కరొక్కరం కాదు… అంతా కలిసి లొంగిపోతాం..
Maoist Party: ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని మావోయిస్టు పార్టీ(Maoist Party) లేఖ విడుదల చేసింది. జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపింది. జనవరి 1న సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న(Maoist top leaders Mallojula, Asanna) లొంగుబాటు, హిడ్మా(Hidma) ఎన్‌కౌంటర్‌తో పార్టీ బలహీనమైందని లేఖలో పేర్కొన్నారు. పరస్పర సమన్వయం , కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని స్పష్టం చేశారు. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేర్కొన్నారు.
మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMC) పేరిట కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిన ఈ లేఖలో ప్రభుత్వం పిలుపు ఇస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి ఒక నెల పాటు హత్యాబంద్ (కిలింగ్ స్టాప్), పోరాట విరామం అమలు చేయాలని మావోయిస్టులు నిర్ణయించారు. ఈ విరామ సమయంలో ప్రభుత్వం చర్చల కోసం ముందుకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చర్చల కోసం ముందుకు రావాలని, దీనితో అటవీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని పేర్కొన్నారు. తాము ఇంతకుముందు 2022లో కూడా పోరాట విరామం ప్రకటించినా, అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదని MMC పేర్కొంది. ఆ తప్పిదాన్ని ఈసారి పునరావృతం చేయకుండా, ప్రభుత్వాలు నిజమైన చర్చలకు రావాలని లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీల భూమి హక్కులు, పోలీసు దాడులు, అభివృద్ధి లోపం వంటి సమస్యలపై ప్రభుత్వాలతో ఓపెన్ డిబేట్లు, చర్చలు జరగాలని కమిటీ డిమాండ్ చేసింది.
ఎన్‌కౌంటర్ పేరుతో నిరపరాధులు చనిపోతున్నారని ఆరోపిస్తూ, ఈ ఘటనలు ఆగితేనే శాంతి చర్చలు సార్థకం అవుతాయని మావోయిస్టులు పేర్కొన్నారు. చర్చలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారికంగా ప్రకటించాలని కోరారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 1, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 11.15 మధ్య సంప్రదింపులకు ఓపెన్ లైన్‌గా ఒక ఫోన్ నంబర్ విడుదల చేశారు. పోరాట విరామ సమయంలో ఏ దాడులు, ప్రతిదాడులు జరగకూడదని, ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మావోయిస్టులు కోరారు.