భార‌త్ రానున్న‌ పుతిన్‌

Putin India Visit 2025 : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ రానున్నారు. ఆయ‌న డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ 23వ ఇండియా–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. పుతిన్ భారత పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని ఎంఈఏ పేర్కొంది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు అమలు చేస్తోన్న సమయంలో పుతిన్‌ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

2021 తర్వాత పుతిన్‌ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. 2024లో ప్రధాని మోదీ (PM Modi), పుతిన్ (vladimir-putin) రెండుసార్లు సమావేశమయ్యారు. 2024 జులైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో మోదీ.. రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ అందుకున్నారు. గతేడాది అక్టోబర్‌లోనే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో రష్యాలో కజాన్‌లో వీళ్లిద్దరూ మళ్లీ భేటీ అయ్యారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార సంస్థ సదస్సు జరగగా.. అక్కడ మోదీ, పుతిన్ భేటీ అయ్యి పలు విషయాలపై చర్చలు జరిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన మన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ-పుతిన్‌ ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. ఆయన గౌరవార్థం భారత రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పుతిన్‌ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు భవన నిర్మాణం, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, జౌళి రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో 70వేల మందికి పైగా భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like