సీఎం రేవంత్ మంచి ఆటగాడే..
Telangana Chief Minister Revanth Reddy Practiced Football: స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో గంట పాటు ప్రాక్టీస్ చేశారు. రోజంతా కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం రాత్రి ఫుట్ బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్ లోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. యువతతో కలిసి ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. సుమారు గంటపాటు ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రపంచ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ భారత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ టూర్‌లో భాగంగా డిసెంబర్ 13న ఆయన హైదరాబాద్ రానున్నారు. మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుందీ సమ్మిట్. తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.
రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధత తెలిపారు. ఇందులో పాల్గొనడానికి ఫుట్ బాల్ ఆల్ టైమ్ గ్రేట్ లయోనెల్ మెస్సీ సైతం హైదరాబాద్ కు రానున్నాడు. ఆయన రాక అధికారికంగా ఖరారైంది కూడా. ఈ నెల 13వ తేదీన మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.