గోవాలో ఘోర అగ్ని ప్రమాదం.. 23 మంది మృతి
Major fire accident in Goa:గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నార్త్ గోవాలోని ‘Birch by Romeo Lane’ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది క్లబ్‌లోని కిచెన్ సిబ్బంది ఉండగా, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నలుగురు పర్యాటకులు ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్లబ్లో జరిగింది. రాజధాని పనాజీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాపులర్ పార్టీ వేదిక అర్పోరా గ్రామంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించారు. గోవా పోలీస్ చీఫ్ ఆలొక్ కుమార్ మాట్లాడుతూ, సిలిండర్ పేలుడు వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి సావంత్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరణించిన 23 మందిలో ముగ్గురు తీవ్ర గాయాలతో మరణించారని, మిగిలినవారు ఊపిరాడక చనిపోయారని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ నైట్ క్లబ్ ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదని, అందువల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు వెల్లడించారు. .
క్లబ్ యాజమాన్యంపై, అలాగే భద్రతా నిబంధనలను ఉల్లంఘించి క్లబ్ నిర్వహించడానికి అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సావంత్ తెలిపారు. మరో 25 రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్న తరుణంలో ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మరణించిన 23 మంది మృతదేహాలను క్లబ్ ప్రాంగణం నుండి వెలికితీసి, బాంబోలిమ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించినట్లు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే లోబో వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రంతా సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని.. అన్ని క్లబ్‌లలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిమన్నారు. ఈ ప్రమాదం గోవాలో పర్యాటకులను, స్థానికులను తీవ్రంగా కలచివేసింది. భద్రతా ప్రమాణాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.