సింగరేణికి రెండు అనుబంధ కంపెనీలు
Singareni:సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు కొత్త అనుబంధ సంస్థల ఏర్పాటుకు పేర్లను రిజర్వు చేయించింది. దేశ విదేశాల్లో చేపట్టనున్న సోలార్ విద్యుత్తు తదితర పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ కోసం సింగరేణి గ్రీన్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్(Singareni Green Energy Company Limited) పేరుతో ఒక అనుబంధ సంస్థ, విదేశాలలో ఖనిజాల తవ్వకం ముఖ్యంగా కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తదితర వ్యాపారాల నిర్వహణ కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్(Singareni Global Limited) పేరుతో మరొక అనుబంధ సంస్థ రిజర్వు చేయించింది.
గత నెలలో ఈ రెండు అనుబంధ కంపెనీల పేర్ల కోసం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కు అనుబంధంగా ఉన్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల్లో దరఖాస్తు చేయగా ఇటీవల ఈ రెండు పేర్ల రిజర్వేషన్ కు అనుమతిని మంజూరు చేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఒక లేఖ ద్వారా తెలిపారు. ఈ రెండు కొత్త అనుబంధ సంస్థల ఏర్పాటుపై కేంద్ర బొగ్గు శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ సింగరేణికి లేఖ రాస్తూ సింగరేణి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తిస్తున్నామని స్ఫష్టం చేశారు. ఆ సంస్థలు లాభదాయకంగా వ్యాపారాలు కొనసాగించాలని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు.
మొత్తం మీద గత 13 దశాబ్దాలుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరుతో మాత్రమే నడుస్తున్న కంపెనీ ఇప్పుడు మరో రెండు అనుబంధ సంస్థలతో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని పలువురు భావిస్తున్నారు.