కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారు
-ఆ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కింది
-ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు
-ప్రజల అవస్థలు మంత్రికి పట్టడం లేదు
-45 వేల ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ ఏమైంది..?
-మంచిర్యాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
Balka Suman:అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెబుతారని టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ నిలబెట్టుకోలేదని, అబద్ధపు హామీలతో పూట గడుపుతున్నారని దుయ్యబట్టారు. చెన్నూరు నియోజకవర్గం లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మినీ స్టేడియం 100 పడకల ఆసుపత్రి ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదన్నారు. మహిళలు రోడ్లపై కూరగాయల వ్యాపారాన్ని కొనసాగిస్తు నానా అవస్థలు పడుతున్నా మంత్రి కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌక్ నుంచి కోటపల్లి బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడతామని సర్వేలు నిర్వహిస్తున్నారని వ్యాపారులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. స్థానిక వ్యాపారస్తుల కోరిక మేరకు తమ పాలనలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టకుండా బైపాస్ రోడ్డు నిర్మించామని తెలిపారు. మంత్రి వివేక్‌కు చిత్తశుద్ధి ఉంటే ఫ్లైఓవర్ నిర్మించాలన్నారు.
ఎన్నికల ముందు మంత్రి వివేక్ వెంకటస్వామి ఫ్యాక్టరీ నిర్మించి 45 వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా దిక్కు లేదన్నారు. తమ కుటుంబంలో మాత్రం ముగ్గురికి ఉద్యోగాలు సంపాదించుకున్నారని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. గోదావరి ముంపు గ్రామాల రైతులకు నష్టం వాటిల్లకుండా గోదావరి చుట్టూ కరకట్టలు కట్టిస్తానని వాగ్దానం చేశాడని అది ఇప్పటివరకు దిక్కు లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల నుంచి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
చెన్నూరు పట్టణంలో తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు, ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.