బీఆర్ఎస్ కార్యకర్త హత్య
Sarpanch Election:స్థానిక ఎన్నికల్లో రక్తం చిందింది. సర్పంచ్ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణలో ఎన్నికలు ఓ హత్యకు దారి తీశాయి. సూర్యాపేట జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్త మృత్యవాత పడ్డారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ (ఎం) లింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడంతో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ దాడిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ తోపాటు 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో సూర్యాపేట జిల్లా కీలకం. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో, జిల్లా ఎస్పీ నర్సింహ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది ఇదే గ్రామంలో మాజీ సర్పంచ్ హత్యకు గురవడంతో, పోలీసులు ఈసారి ఎక్కువ అప్రమత్తత పాటించారు. 1500 మంది పోలీసు సిబ్బంది నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్, సమస్యాత్మక కేంద్రాల వద్ద ఆన్‌లైన్ వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో నిఘా, 170 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు, 1284 మందిని ముందస్తుగా బైండోవర్, 53 లైసెన్స్ ఆయుధాల డిపాజిట్, రూ. 9.50 లక్షల విలువైన 1425 లీటర్ల మద్యం సీజ్ వంటివి చేశారు.