యుద్ధతంత్ర నిపుణుడు.. అపార ప్రతిభాశాలి…
బిపిన్ రావత్… ఈ పేరు వింటే చాలు భారతీయుల ఛాతీ ఉప్పొంగుతుంది. ఆత్మ రక్షణ విధానాల నుంచి ఎదురుదాడి వైపు నడిపించిన వ్యక్తి ఆయన. తండ్రి స్ఫూర్తితో ఆయన విధులు నిర్వర్తించే బెటాలియన్‌లోనే చేరిన రావత్.. అంచెలంచెలుగా త్రివిధ దళాధిపతి స్థాయికి చేరారు.
సైన్యాధ్యక్షుడిగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ అత్యుత్తమ సేవలు అందించారు. తరతరాలుగా.. భారత సైన్యానికి సేవలు అందిస్తున్న కుటుంబంలో జన్మించిన రావత్ భారత సైనిక దళాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తమిళనాడు కూనూర్‌లో జరిగిన ఘోర ప్రమాద సమయంలో.. రావత్ ఆ హెలికాప్టర్లోనే ఉన్నారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశమంతటా త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ గురించి చర్చ నడుస్తోంది. ఆయన ప్రస్థానాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సైన్యానికి సేవలు అందిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. అదే సైన్యంలో దాదాపు 40 ఏళ్ల సేవలు అందించి, ఎన్నో శిఖరాలను అధిరోహించారు. 1958లో మార్చి 16న ఉత్తరాఖండ్‌లో హిందూ గర్వాలీ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. బిపిన్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేశారు. ఆయన తల్లి ఉత్తరకాశీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె. దెహ్రాదూన్‌లోని కాంబ్రియన్ హాల్, సెయింట్ ఎడ్వర్డ్స్ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ, వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో చదువుకున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆయన ప్రతిభకు ‘స్వార్డ్ ఆఫ్ హానర్’ అవార్డు లభించింది. అమెరికా కాన్సాస్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హైయర్ కమాండ్ కోర్స్‌ను చేశారు.
1978 డిసెంబర్ 16న ఆర్మీలో చేరారు రావత్. తన తండ్రి పనిచేసిన గోర్ఖా రైఫిల్స్ 11కు చెందిన ఐదో బెటాలియన్‌లోనే బాధ్యతలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతాల్లో చేసే యుద్ధాల్లో రావత్‌కు తిరుగులేదు. పదేళ్ల పాటు తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లోని ఉరీలో మేజర్ హోదాలో పనిచేశారు. 2016 డిసెంబర్ 17న ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపికయ్యారు. ఇద్దరు సీనియర్లను వెనక్కి నెట్టి ఆయన ఈ పదవి దక్కించుకున్నారు. గోర్ఖా బ్రిగేడ్ నుంచి ఆర్మీ చీఫ్‌గా ఎదిగిన ముగ్గురు అధికారుల్లో రావత్ ఒకరు. రావత్.. నేపాల్ ఆర్మీకి గౌరవాధ్యక్షులు కూడా.
చైనాతో 1987లో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. 1962 యుద్ధం తర్వాత మెక్‌మోహన్ రేఖ వద్ద జరిగిన తొలి సైనిక ఘర్షణ ఇదే. ఈ సమయంలో తన బృందాన్ని సమర్థవంతంగా నడిపించారు రావత్. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐరాస తరపున నిర్వహించిన మిషన్.. రావత్ విజయాల్లో చెప్పుకోదగినది. దక్షిణ కివూ రాజధాని గోమాను ఆక్రమించుకునేందుకు సాయుధ తిరుగుబాటు దారులు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశారు. దేశవ్యాప్తంగా అస్థిరత, సాయుధ తిరుగుబాటులు నెలకొన్న సమయంలో ఐరాస శాంతిదళాల తరపున పోరాడిన బృందానికి రావత్ అధ్యక్షత వహించారు. సీఎన్డీపీ సహా ఇతర సాయుధ తిరుగుబాటుదారులపై దూకుడుగా దాడి చేస్తూనే.. స్థానిక ప్రజల భద్రతకు చర్యలు తీసుకున్నారు. ప్రజలతో సైన్యం మమేకమై, వారి సహకారాన్ని పొందేలా వ్యవహరించారు. నాలుగు నెలల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. గోమాను తిరుగుబాటుదారుల వశం కాకుండా కాపాడటమే కాకుండా.. సాయుధ దళాలను చర్చలకు దిగివచ్చేలా చేశారు.
2015 జూన్‌లో మణిపుర్‌కు చెందిన యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ తిరుగుబాటుదారులు భారత సైనికులపై దాడి చేసి 18 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ సమయంలో దిమాపుర్ కేంద్రంగా పనిచేసే కార్ప్స్ 3కు కమాండింగ్ అధికారిగా రావత్ వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత.. సీమాంతర దాడులతో భారత సైన్యం విరుచుకుపడింది. 21వ బెటాలియన్‌కు చెందిన పారాషూట్ రెజిమెంట్.. ఎన్ఎస్సీఎన్-కే తిరుగుబాటు సంస్థ స్థావరాన్ని ధ్వంసం చేసింది.చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా.. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా 2020 జనవరి ఒకటిన బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా చైనా విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. సైన్యం, ఎయిర్‌ఫోర్స్ మధ్య సమన్వయం మెరుగుపర్చి.. వాస్తవాధీన రేఖ వెంబడి నిఘాను పటిష్ఠం చేసేలా చర్యలు తీసుకున్నారు. మిలిటరీతో పాటు దౌత్యపరంగా విశేష సేవలు అందించారు రావత్. ఆయా దేశాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేయడంలో కృషి చేశారు.