సింగరేణిని నిండా ముంచుతున్నారు
-మెడికల్ అన్‌ఫిట్‌లో కార్మికులకు తీరని అన్యాయం
-కండ్లు కనబడని వారు, క్యాన్సర్ ఉన్న వారిని ఫిట్ చేస్తారా..?
-నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు
-రెండేళ్లకు రెండు బోర్డులు నిర్వహించారు
-రేవంత్‌రెడ్డి సింగరేణి నిధులు నీ అయ్య సొత్తా...?
-భట్టి విక్రమార్క ఇదే నా నీ ప్రజాప్రభుత్వం..?
-కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు ధ్వజం
Singareni:కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా, ఉన్న వాటికి ఎగనామం పెడుతోందని, మెడికల్ అన్‌ఫిట్‌లో కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు(Harish Rao) ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో మెడికల్ అన్‌ఫిట్‌లో అన్యాయం జరిగిన కార్మికులను తీసుకువెళ్లిన ఆయన సింగరేణి డైరెక్టర్ (పా) గౌతం పొట్రూకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నెలకు ఒక మెడికల్ బోర్డు నిర్వహిస్తే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ నెలకు ఒక్క మెడికల్ బోర్డు పెడుతున్నారు.. మేం నెలకు రెండు బోర్డు పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని దుయ్యబట్టారు. వారు రెండేళ్లలో కేవలం రెండు మెడికల్ బోర్డులు మాత్రమే నిర్వహించారని అన్నారు. ఇది ఎంత దుర్మార్గమో ఆలోచించాలని కార్మికులను కోరారు.
కాంగ్రెస్ హయాంలో నిర్వహించిన రెండు మెడికల్ బోర్డుల్లో సైతం కార్మికులకు తీరని అన్యాయం చేశారని అన్నారు. మొదటి బోర్డుకు 55 మంది వెళితే కేవలం ఐదుగురిని మాత్రమే అన్‌ఫిట్ చేశారని, 123 మంది వెళితే 23 మందిని మాత్రమే అన్‌ఫిట్ చేశారని అన్నారు. 100 మంది మీరు ఫిట్ ఉన్నారు వెళ్లి పనిచేయమని చెబుతున్నారని చెప్పారు. కండ్లు సరిగ్గా కనిపించని వారిని, కాళ్లు లేని వాళ్లను, క్యాన్సర్ వచ్చిన వాళ్లను అన్‌ఫిట్ చేయాల్సింది పోయి.. నువ్వు మంచిగున్నవ్ వెళ్లి పనిచేయాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ప్రస్తుతం 42వేల మంది పనిచేస్తుంటే అందులో 20 వేల మంది డిపెండెంట్ ఉద్యోగులేనని.. ఈ గొప్పదనం బీఆర్ఎస్ ప్రభుత్వానిది.. కేసీఆర్‌దేన్నారు. కార్మికులను కాపాడుకున్నది… కార్మికులను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు గుర్తు చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్మికులపై పగబట్టి, కక్షకట్టి వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి నెలా మెడికల్ బోర్డు పెట్టాలని రేవంత్‌రెడ్డిని హెచ్చరిస్తున్నామన్నారు. బైపాస్ సర్జరీ అయినా అలాంటి వాళ్లు కూడా మెడికల్ బోర్డుకు వెళితే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కార్మికులనే తీసుకువచ్చామని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క నీ మాటలు కోటలు దాటుతాయ్ కదా… మీది ప్రజా ప్రభుత్వం అంటావ్ కదా..? ఇది ప్రజా ప్రభుత్వమా..? కార్మికులు, ప్రజలను గోస పెట్టే ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు. భట్టి ఆర్థిక మంత్రి, సింగరేణి మంత్రి మరి ఆయన సింగరేణి గొంతు కోయడం తగునా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనుల వల్ల సింగరేణి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ కోసం సింగరేణి డబ్బులు తీసుకున్నావ్… నీ అయ్య సొత్తా..? అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు సింగరేణిలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఓడిలతో నడుస్తుంటే పది కోట్లు నీ ఫుట్‌బాల్ సోకుల కోసం వాడుకుంటావా..? అన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సీఎస్ఆర్ నిధులు మెడికల్ కాలేజీలు కట్టడానికి వారి పాఠశాలల కోసం, మంచినీళ్ల కోసం వాడామన్నారు. సింగరేణి కార్మికుల డబ్బులు తీసుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందంటూ దుయ్యబట్టారు. కార్యక్రమంలో హరీష్‌రావుతో పాటు మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, జనరల్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, భూపాలపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పెండ్రి అన్వేష్, రత్నం అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.