ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ఒకరి సజీవ దహనం

Train Fire :ఎర్నాకుళం వెళ్లే (18189 నంబరు) ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటలకి అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలులో ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు పొగను గమనించి, తక్షణమే రైలును స్టేషన్‌లో ఆపేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు మంటలు రెండు బోగీలకు పూర్తిగా వ్యాపించి, అవి పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఒకరు సజీవదహనం..
ఘటనా ప్రాంతానికి విజయవాడ డీఆర్ఎం మోహిత్ చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు సజీవదహనం అయ్యారని, మృతుడిని విశాఖకు చెందిన చంద్రశేఖర్ (70)గా గుర్తించామన్నారు. B1లోనే మంటలు చెలరేగిట్లుగా తెలుస్తోందని, ఏసీ కోచ్ కావడంతో దుప్పట్లకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయని తెలిపారు. బోగీల్లో ఇంకా ఎవరైనా చిక్కుకుని మరణించారా అని తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై మిగతా కోచ్ లను వాటి నుంచి వేరు చేశారు . దీంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై, తమ బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని రైల్వేస్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like