మ‌హా విరాళం..

IIT Kanpur:తమకు ఉన్నత విద్య అందించిన విద్యా సంస్థ‌కి పూర్వ విద్యార్థ ఉలు రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది దేశంలోనే పూర్వ విద్యార్థుల నుండి వచ్చిన అతిపెద్ద విరాళంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో పూర్వ విద్యార్థుల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

తమకు ఉన్నత విద్యాబుద్ధులు నేర్పి… జీవితంలో గొప్పగా స్థిరపడేందుకు దోహదం చేసిన విద్యాలయానికి తమ వంతుగా సాయం చేయాలని భావించారు పూర్వ విద్యార్థులు. ఎవరికి తోచినంత వారు విరాళం ఇచ్చారు. అది చివరకు రూ.100 కోట్లు అయ్యింది. తమకు గొప్ప భవిష్యత్తు అందించిన విద్యాలయం పట్ల పూర్వ విద్యార్థులు చూపిన అపూర్వ ప్రేమ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. విరాళంగా రూ.100 కోట్లు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఐఐటీ కాన్పుర్‌లో చదువుకున్న పూర్వ విద్యార్థులు.. తమ మాతృ విద్యా సంస్థపై అపూర్వ ప్రేమ చాటుకున్నారు. 2000 సంవత్సరం బ్యాచ్‌కి చెందిన విద్యార్థులు తాజాగా విద్యాసంస్థ ప్రాంగణంలో జరిగిన రజతోత్సవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే తమ విద్యా సంస్థ‌కి రూ. 100 కోట్లు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పూర్వ విద్యార్థులు తమ మాతృ విద్యా సంస్థ కోసం ఇంత పెద్దమొత్తంలో విరాళం ప్రకటించడం దేశంలోనే ఇదే మొదటి సారి. ఈ విరాళం మొత్తాన్ని.. ‘మిలేనియం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సొసైటీ’ ఏర్పాటుకు వినియోగించాల్సిందిగా యాజమాన్యాన్ని కోరారు. ఈ 2000 బ్యాచ్‌కు చెందిన ప‌లువురు విద్యార్థులు మాట్లాడుతూ ఐఐటీ కాన్పూర్ తమకు కేవలం ఒక డిగ్రీని మాత్రమే ఇవ్వలేదని… పెద్దగా కలలు కనే ధైర్యం, ప్రశ్నించే స్వభావం, నిర్మించే తత్వాన్ని ఇచ్చిందని తెలిపారు. సిల్వర్ జూబ్లీ రీయూనియన్ తమ అందరికీ.. ఆత్మపరిశీలనకు, మధుర జ్ఞాపకాలను తలచుకునే క్షణమని తెలిపారు. రూ. 100 కోట్ల ఈ సమిష్టి విరాళం తమ ఉమ్మడి విలువలకు, ఐఐటీ కాన్పూర్‌తో ఉన్న తమ శాశ్వత అనుబంధానికి నిదర్శమని తెలిపారు. భవిష్యత్ సంస్థ-నిర్మాతలను తీర్చిదిద్దేందుకు తమ ఆల్మా మేటర్‌తో కలిసి పనిచేయాలని తాము ఎదురుచూస్తున్నామ‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like