ఆటో బొలెరో ఢీ, విద్యార్థులకు గాయాలు
లక్ష్సెట్టిపేటలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు గాయపడ్డారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తరలించే ఆటో ను బొలెరో ఢీ కొట్టింది. స్థానిక సీ ఎస్ ఐ రోడ్ లోని కెనాల్ వద్ద ఆటోను వేగంగా వచ్చిన బొలెరో ఢీ కొట్టింది. దీంతో ఆటో కాలువలో పడిపోయింది. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, నలుగురు విద్యార్థులకు కాళ్లు, చేతులు ఫ్యాక్చర్ అయ్యాయని బాధితులు వెల్లడించారు.
కాగా, ఈ ఇరుకైన కెనాల్ ప్రమాదాల గురించి పత్రికల్లో కథనాలు వచ్చినా సంబంధిత ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇరిగేషన్ అధికారులను సంప్రదించి కెనాల్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సీఎస్ ఐ చర్చ్ గెట్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తే ప్రమాద వివరాలు మరింతగా తెలిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని బొలెరో డ్రైవర్‌పైన కేసు నమోదు చేస్తామని ఎస్ఐ వెల్లడించారు.