2029లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి
Mancherial DCC President Pinnanti Raghunath Reddy:2029లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరాలని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు సైనికుడిలా పనిచేయాలని మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వున్న జిల్లా కార్యవర్గ కమిటీ రద్దు చేస్తున్నామని తెలిపారు. నూతన కార్యవర్గ కమిటీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని త్వరలోనే జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇకపై పదవులు పొందిన ప్రతి ఒక్క జిల్లా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామని, వారు వారి బాధ్యతల పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. 2029 పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మంచిర్యాల జిల్లా కార్యవర్గం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా అబ్జర్వర్ గా వచ్చిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ రహమతుల్లా హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్తను నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో వారి పని తీరు పరిశీలించి రాష్ట్ర, జిల్లా, మండల, బ్లాక్ టౌన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పదవుల్లో నియమిస్తామని వెల్లడించారు.