మందుబాబుల దండ‌యాత్ర‌

Record liquor sales:మ‌ద్యం అమ్మ‌కాల్లో తెలుగు రాష్ట్రాలు గ‌తంలో ఉన్న రికార్డుల‌న్నింటిని కొల్ల‌గొట్టి ముందుకు సాగుతున్నాయి. ప్ర‌భుత్వాలు రికార్డు స్థాయి ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటున్నాయి.  తెలంగాణలో డిసెంబర్ 2025లో రికార్డు స్థాయిలో రూ.5,102 కోట్లకు చేరుకున్నాయి. గత డిసెంబర్ 2023లో మద్యం అమ్మకాలు రూ.4,300 కోట్లు దాటాయి. ఇప్పుడు డిసెంబర్ 30న మాత్రమే మొత్తం మద్యం అమ్మకాలు రూ. 375 కోట్లకు చేరుకున్నాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇది 2025 సంవత్సరంలో ఒకే రోజు జరిగిన అత్యధిక అమ్మకం.

2025 చివరి రోజు డిసెంబర్ 31న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాల ద్వారా సాయంత్రం సమయానికే దాదాపు రూ. 350 కోట్లకుపైగా సంపాదించింది. డిసెంబర్ చివరి రెండు రోజుల మెుత్తం కలిపితే రూ.750 కోట్ల వరకు అమ్మకాలు సాగాయి. 2023, 2024 డిసెంబర్‌తో పోలీస్తే.. ఈసారి 13 వందల కోట్లకుపైగా మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు వేసింది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉండేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతి ఇచ్చింది. కొత్తగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు ప‌లు ర‌కాల బ్రాండ్  ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచాయని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటి కావచ్చు. వేగంగా మారుతున్న  అభిరుచులు, యువతలో పెరుగుతున్న మద్యం వినియోగం రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల నుండి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

ఇక ఆంధ్రాలో కూడా న్యూఇయర్ వేడుకల (New Year Celebrations) సందర్భంగా లిక్క‌ర్ రికార్డు స్థాయిలో అమ్మ‌కం అయ్యింది. డిసెంబర్ 31న ఆంధ్రప్రదేశ్ లో మద్యం విక్రయాలు  గణనీయంగా పెరిగాయి. నిన్న ఒక్కరోజులో రూ.172 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే రూ.60 కోట్లమేర ఎక్కువగా మద్యం తాగారు లిక్కర్ ప్రియులు.గత సంవత్సరం డిసెంబర్ 31న రూ.112 కోట్ల విలువ కలిగిన మద్యం మాత్రమే విక్రయించారు.  జనవరి 1న కూడా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రారంభంలో కూడా మద్యం, బీరు అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. మద్యపాన సరఫరా, మార్కెట్ డిమాండ్, వినియోగదారుల సంఖ్య, వేడుకల సీజన్ వంటి అంశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఈ రకమైన రికార్డు అమ్మకాలు, ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం అందించిందని అధికారులు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like