ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు
ఉత్తర్ప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా నిర్వహించిన సర్వే(SIR)లో 2.89 కోట్ల మంది ఓట్లు తొలగించారు. యూపీలోని మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య దాదాపు 19 శాతంగా ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివర్లో విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో దాదాపు 3 కోట్ల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భారీ ప్రక్షాళన ద్వారా రాబోయే ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) ముగిసింది. ఇందులో సుమారు 15.4 కోట్ల మంది నమోదిత ఓటర్లలో 18.7 శాతం మంది అంటే దాదాపు 2.89 కోట్ల మంది వివరాలు బూత్ లెవల్ ఆఫీసర్ల(బీఎల్ఓలు)కు అందలేదు. వీరందరినీ లెక్కించలేని ఓటర్ల జాబితాలో చేర్చారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లిన వారు, చనిపోయిన వారు, నకిలీ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, అందుబాటులో లేని వారిగా బీఎల్ఓలు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఆ జాబితాలో ఈ 2.89 కోట్ల మంది పేర్లను తొలగించనున్నట్లు తెలుస్తోంది. వారితో పాటు మరిన్ని తొలగింపులు చేరితో ఇది దాదాపు మూడు కోట్లకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ తొలగించే జాబితాలో ఉన్న 2.89 కోట్ల మందిలో సుమారు 1.3 కోట్ల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది.