కరీంనగర్‌లో ఆయుష్ ఆసుపత్రి
-ఉత్తర తెలంగాణకు ప్రజలకు తీపి కబురు
-ఏర్పాటు కానున్న 50 పడకల ఆసుపత్రి
-ఆసుపత్రి నిర్మాణానికి స్థల ఎంపికకు కేంద్రం లేఖ
-ఎంతో ఆనందంగా ఉందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
AYUSH Hospital in Karimnagar:కరీంనగర్ లో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి(Ayush Hospital) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. దీనికి సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్లు అంచనా కాగా, కేంద్రం రూ.7.5 కోట్లను విడుదల చేసింది. 50 పడకల సామర్థ్యంతో నిర్మించే ఈ ఆసుపత్రిలో కాయ చికిత్సకు (20 పడకలు), పంచకర్మ (10), శల్య (10), ప్రసూతి, స్త్రీ రోగ చికిత్సల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, హోమియోపతి, యోగా, నేచురోపతి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందుబాటులోకి రానుంది.
కరీంనగర్‌కు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తెలిపారు. ఇది ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ను ప్రధాన ఆయుష్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఒక దృఢమైన ముందడుగు అన్నారాయన. ఆయుర్వేదం, యోగా & నేచురోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ వైద్య సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తుందని చెప్పారు. సాంప్రదాయ వైద్య విధానాలను బలోపేతం చేయడంలో నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర (Narendra Modi)కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లిన ఆయుష్ శాఖ మంత్రి ప్రతావప్ జాదవ్ (Prataprao Jadhav)కి, ఈ అంశంలో సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Anumula Revanth Reddy)కి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి కృతజ్ఞతలు చెబుతున్నాని స్పష్టం చేశారు.