రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు
Vaikuntha Dwara Darshanam:తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తెలిపారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్‌వో మురళీకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం(Vaikuntha Dwara Darshanam) చేసుకున్నారని పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించిన ఏర్పాట్లపై 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. 2023లో 6.47 లక్షల మంది, 2024లో 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని.. గతేడాదితో పోల్చితే ఈసారి లక్ష మంది భక్తులు అధికంగా దర్శనం చేసుకున్నారని స్పష్టం చేశారు. 10 రోజుల్లో హుండీ ఆదాయం రూ.41 కోట్లు సమకూరిందని, లడ్డూలు విక్రయాలు 44 లక్షలకు చేరుకున్నాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించామని వివరించారు.
గతేడాది కంటే 27 శాతం అదనంగా భక్తులకు అన్నప్రసాదాలు అందించగలిగినట్లు పేర్కొన్నారు. 50టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్‌తో అలంకరణలు అద్భుతంగా చేశామన్నారు. కల్యాణకట్ట సేవలు, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ప్రణాళిక ప్రకారం క్యూలైన్ల వద్ద మార్పులు చేయడం ద్వారా అంచనా కంటే అధిక సంఖ్యలో భక్తుల వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారని బీఆర్ నాయుడు తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం చేయించగలిగామన్నారు. జనవరి 2న శుక్రవారం అయినా రికార్డుస్థాయిలో 83 వేల మంది భక్తులకు దర్శనం కలిగిందన్నారు. 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడంతో సామాన్య భక్తుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. చక్కటి సేవలు అందించిన పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకులకు చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.