ఎగ్జిట్స్ పోల్స్.. ఏ పార్టీ సత్తా ఎంతంటే..?
Telangana Municipal Elections.. Exit Polls:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. అయితే అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా ఎంత అంటూ చేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. అటు పీపుల్స్ పల్స్, ఇతర సర్వేలు సైతం దాదాపు ఒకే పార్టీకి జై కొడుతున్నాయి..
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం… కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో జెండా ఎగురవేసే అవకాశం కనిపిస్తుండగా, ఉత్తర తెలంగాణలో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంటోంది. గతంలో పట్టణాలపై పట్టు సాధించిన బీఆర్‌ఎస్ ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఏడు కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ దక్కించుకుంటుందని, బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ నూ సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68- 76 సీట్లు, బీఆర్ఎస్ 29- 36 సీట్లు, బీజేపీ 3- 5 సీట్లు అలాగే ఎంఐఎం 0 నుంచి ఒక్క సీటు ఇక ఇతరులు 8- 14 సీట్లు దక్కించుకుంటారని స్పష్టం చేసింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీకి 36 శాతం ఓట్లు వచ్చినట్లు సర్వే తేల్చింది. బీఆర్ఎస్ పార్టీకి 29.7 శాతం, బీజేపీ పార్టీకి 19.3 శాతం, ఎంఐఎం పార్టీకి 2 శాతం అలాగే ఇతరులకు 9.7 శాతం ఓటింగ్ వచ్చినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. మొత్తం 2,981 వార్డులకు కాంగ్రెస్ 1210 నుంచి 1290 వార్డులు కైవసం చేసుకోనున్నట్లు అంచనా వేసింది. బీఆర్ఎస్ 860 నుంచి 930, బీజేపీ 250 నుంచి 270, ఎంఐఎం 35 నుంచి 44, ఇతరులు 90 నుంచి 110 వార్డులను కైవసం చేసుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది.
కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ 28 నుండి 34 సీట్లతో ముందంజలో ఉన్నప్పటికీ, సీపీఐ పార్టీ కూడా 14 నుండి 16 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తోంది. ఈ నగరంలో వామపక్షాల ప్రభావం ఇంకా బలంగా ఉందని ఈ అంచనాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ ఇక్కడ కేవలం 7 నుండి 9 స్థానాలకే పరిమితం కావచ్చని సర్వే అంచనా వేసింది.
ఇక, ఆపరేషన్ చాణక్య సర్వే ప్రకారం… మొత్తం మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్‌కు 1400-1449 వార్డులు (48% ఓట్లు), బీఆర్ఎస్‌కు 745-793 వార్డులు (26% ఓట్లు), బీజేపీకి 358-399 వార్డులు (13% ఓట్లు) దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఆశ్చర్యకరంగా జనసేన పార్టీ 30-35 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం.