అనూహ్యంగా ఆ పార్టీ విజయం
Waddepally Municipal Results:తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చాలా మందికి కనీసం పేరు కూడా తెలియని ఓ పార్టీ విజయం సాధించి సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటే.. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (AIFB) విజయాన్ని సాధించింది. అది కూడా ఏకపక్షంగా గెలుపొందడం గమనార్హం. మున్సిపాలిటీలోని మొత్తం 10 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది వార్డులను ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థులు దక్కించుకుని ప్రభంజనం సృష్టించారు.
వడ్డేపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 10 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు చూస్తే.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (జాగృతి): అభ్యర్థులు 08 వార్డు్ల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో వార్డుల్లో విజయం సాధించాయి. మొత్తం 10 స్థానాలకు గానూ 8 చోట్ల స్వతంత్రంగా (ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై) పోటీ చేసిన జాగృతి అభ్యర్థులే విజయం సాధించడంతో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆ పార్టీ ఏకపక్షంగా దక్కించుకుంది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏఐఎఫ్‌బీకి చెందిన సింహం గుర్తుపై కవిత మద్ధతుదారులు దాదాపు అన్ని స్థానాల నుంచి పోటీ చేశారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్‌బీ విజయాన్ని సాధించింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 8 స్థానాల్లో కవిత మద్ధతుదారులు విజయం సాధించగా, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్క స్థానానికే పరిమితమైంది. దీంతో ఇప్పుడీ విజయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.