త‌ప్పుడు వార్త‌లు న‌మ్మ‌కండి

-సీపీఐ-బీఆర్ఎస్ పొత్తు అలాగే కొన‌సాగుతుంది
-ఈ పొత్తును ఎవ‌రూ దెబ్బ‌తీయ‌లేరు
-మ‌మ్మ‌ల్ని హేళ‌న చేసిన వారికి ఓట‌రు బుద్దిచెప్పారు
-సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, సీపీఐ-బీఆర్ఎస్ పొత్తును ఎవరూ దెబ్బతీయలేరని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ స్పష్టం చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల అనంతరం రామకృష్ణాపూర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అహంకారానికి ఓటర్లే సరైన బుద్ధి చెప్పారని మండిపడ్డారు. సీపీఐ-బీఆర్ఎస్ పొత్తుతో సాధించిన విజయంపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. క్యాతనపల్లిలో ఇరు పార్టీల సమన్వయంతోనే చైర్మన్, పాలక మండలి ఎన్నిక జరుగుతుందని వివరించారు.

రాష్ట్ర పరిస్థితులు, జిల్లా రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే సీపీఐ,బీఆర్ఎస్ క‌లిసి పోటీ చేశాయని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో సీపీఐ, ఏఐటీయూసీకి బలం లేదని హేళన చేసిన కాంగ్రెస్ కు కార్మికులు తగిన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. త‌మ‌ను తక్కువ అంచనా వేయడం వల్లనే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి ఎదురైందని దుయ్య‌బ‌ట్టారు. రామకృష్ణాపూర్ పరిధిలోని 22 వార్డుల్లో బీఆర్ఎస్-ఎఐటీయూసీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అద్భుత విజయాన్ని సాధించాయని తెలిపారు. స్నేహధర్మానికి కట్టుబడి బిఆర్ఎస్ తో కలిసి పోటీ చేశామని, కార్మిక వర్గంపై కాంగ్రెస్ అనుసరించిన వైఖరి వల్లే ప్రజలు ఇలాంటి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని విశ్లేషించారు. ప్రజలు ఆశీర్వదించిన ఈ పొత్తును విమర్శించడం కాంగ్రెస్ కు మంచిది కాదని హెచ్చరించారు. ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like