ఆ పోలీసుల‌ను వ‌దిలిపెట్టం..

కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసుల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌.. రేపు మళ్ళీ బీఆర్ఎస్ రాగానే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఎవరూ కాపాడలేరని.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హెచ్చ‌రించారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. క్యాతన్‌పల్లిలో దొడ్డిదారిన అధికారం లాక్కునేందుకు.. మంత్రి వివేక్, పోలీసుల ముందే మా దళిత, గిరిజన మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం ఆక్షేపణీయమని దుయ్య‌బట్టారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి పట్టపగలే ప్రజాతీర్పు కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

కావాల‌నే క‌క్ష‌సాధింపు..
బాల్క సుమ‌న్ తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని… రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి… ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నా.. వాళ్లను అక్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి కావాల‌నే క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. క్యాతన్‌పల్లిలోని 22 స్థానాలకు 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. బీఆర్ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారని స్ప‌ష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ శిరసావహించాల్సింది పోయి, ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదన్నారు.

కోరం ఉన్నా ఎన్నిక వాయిదా వేశారు..
చైర్మన్ ఎన్నిక రోజు కోరం ఉన్నప్పటికీ కావాలనే చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారని అన్నారు. మంత్రి వివేక్ చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, అసభ్యంగా ప్రవర్తించారని…. మహిళలపై చేయి చేసుకున్నారని హ‌రీష్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంత్రి వివేక్ అక్కడే ఉండి కనీసం పట్టించుకోకపోవడం దారుణ‌మ‌న్నారు. క్యాతన్‌పల్లి మహిళా కౌన్సిలర్ల తరపున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం కంప్లైంట్ తీసుకోలేదన్నారు. కౌన్సిల్‌కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. రాజిరెడ్డి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టారని హ‌రీష్‌రావు దుయ్య‌బ‌ట్టారు.

వాళ్లేందుకు నోరు విప్ప‌రు..
రాహుల్ గాంధీ ఈ రోజు ఢిల్లీలో తెలంగాణ క్యాబినెట్‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారని హ‌రీష్‌రావు ప్ర‌శ్నించారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరు..? రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరు..? అంటూ కాంగ్రెస్ నేత‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చట్టాన్ని అతిక్రమించి, పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు రేవంత్ రెడ్డి, వివేక్ ఎవరూ మిమ్మల్ని కాపాడలేరన్నారు. మీరు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు” అని హరీష్‌రావు తీవ్రంగా హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like