జైలులోనూ బాల్క సుమన్‌కు వేధింపులు
Balka Suman:ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారని సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ ఆరోపించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా పనిచేసిన బాల్క సుమన్ కు ప్రజా ప్రతినిధికి కల్పించాల్సిన కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే బాల్క సుమన్ పై జైలులో కూడా అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జైల్లో ఒక సాధారణ ఖైదీకి కల్పించాల్సిన సదుపాయాలు కూడా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని… వాటిని జైలు అధికారులు పాటిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. జైలులో బాల్క సుమన్ ను మానసిక క్షొభకు గురి చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. సమయానికి భోజనం కూడా అందించడం లేదని, నాణ్యతలేని నాసిరకం భోజనం అందిస్తున్నారని దుయ్యబట్టారు. చీకటి గదిలో ఉంచి కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. బాల్క సుమన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, వైద్య సదుపాయం కావాలని అడిగిన జైలు అధికారులు కనీసం స్పందించడం లేదన్నారు. నడుము నొప్పితో బాధపడుతున్న కుర్చీని సమకూర్చాలని అడిగిన అధికారుల నుంచి స్పందన లేదని స్పష్టం చేశారు.
ఏది అడిగినా పైనుంచి ఆదేశాలు లేవని జైలు అధికారులు చెబుతున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా పనిచేసిన బాల్క సుమన్ కు కనీస ప్రోటోకాల్ కల్పించకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ పట్ల జైలు అధికారులు వ్యవరిస్తున్న తీరుపై కోర్టులో ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.