చిప్ప‌కూడు తినే టైం వ‌స్త‌ది..

KTR:ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి, మళ్ళీ నువ్వు చిప్పకూడు తినే టైం వస్తుంది. తప్పకుండా ఆ రోజు నువ్వు తగిన శిక్షను అనుభవిస్తావని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆగ్ర‌హం వ్య‌క్ం చేశారు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Former MLA Balka Suman), ఇతర పార్టీ నేతలను పరామర్శించిన అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ సుమన్‌కి ఇవాళ జైలుకు పోవడం కొత్త కాదన్నారు. ఉద్యమ కాలంలో అనేకసార్లు జైలుకు పోయిండు, ఆరు నెలలకు పైగా వివిధ సందర్భాల్లో జైల్లో ఉన్నాడని స్ప‌ష్టం చేశారు. అలాంటిది రేవంత్ రెడ్డి ఈ అక్రమ కేసుతో మా నాయకుడిని భయపెట్టిస్తామంటే ఎవరూ భయపడరని కేటీఆర్ వెల్ల‌డించారు.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను, దుర్మార్గాలను మొత్తం రాష్ట్రం గమనించిందని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి 10 స్థానాలు, మాతో పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి 4 స్థానాలు – మొత్తం 14 స్థానాలు వస్తే అధికారం చేజిక్కకుండా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తోంద‌న్నారు. 22 స్థానాల్లో కేవలం ఏడు స్థానాలు గెలిచినా అప్రజాస్వామికంగా ఆ మున్సిపాలిటీ దక్కించుకునేందుకు అధికార దాహం, కక్కుర్తి చూపించిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్రి వివేక్ దురాగతాలు, అధికార యంత్రాంగం పూర్తిగా అరాచకంగా ప్రవర్తించి ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు కేటీఆర్‌.

కేవలం అక్కడే కాకుండా అనేక ప్రాంతాల్లో ఇదే తీరుగా సాగుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి చోట్ల కూడా ఇదే రకమైన అరాచకాన్ని చేసిందన్నారు. క్యాతన్‌పల్లిలో ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా 14 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి లొంగకుండా నిలబడ్డార‌ని అన్నారు. త‌మ‌ పార్టీ మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించి దాడికి దిగినా అక్కడ మంత్రి గానీ, ఎంపీ గానీ నవ్వుకుంటూ చూశారు త‌ప్ప‌.. నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు. ఇంత దిగజారుడు రాజకీయం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరిగి ఉండదని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్ర డీజీపీ ఒక పార్టీకి ఒక న్యాయం, కాంగ్రెస్ – బీజేపీకి ఇంకో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల అరాచకాలు డీజీపీకి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఒక్కొక్కరికి మూడు కోట్ల రూపాయల డబ్బులు ఆశ చూపినా నిజాయితీ కలిగిన బిడ్డలుగా కౌన్సిలర్లు లొంగలేదన్నారు. మీ పైసలు వద్దు, ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ వెంట ఉంటాం, మా సోదరుడు సుమన్ వెంట ఉంటామంటూ అండగా నిలబడ్డారు. ఇంత బలంగా నిలబడిన మా పార్టీ కౌన్సిలర్లకు, పొత్తు ధర్మానికి అనుగుణంగా నిలబడిన సిపిఐ నాయకులకు కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

డీజీపీ శివధర్ రెడ్డి కూడా పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టిండ‌ని… రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదని, కాకి బుక్ ఉంటుంది అని చెప్పార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఈరోజు కాకి బుక్ ఎక్కడికి పోయింది…? మీ పోలీసులను యూజ్ లెస్ ఫెలో అన్న, బట్టలు ఊడదీసి కొడతా అన్న కేసు ఎందుకు పెట్టడం లేదు…? రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్లకు ఒక నీతి, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు ఒక నీతా…? ఈ విష‌యం డీజీపీ స్ప‌ష్టం చేయాల‌ని నిల‌దీశారు. డీజీపీ గానీ, రేవంత్ రెడ్డి గానీ అధికారం ఎవడికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నామ‌ని కేటీఆర్ కోరారు. క్యాతన్‌పల్లి ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌లో ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకతగా నిర్వ‌హించాల‌న్నారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా దారుణంగా పనిచేస్తున్నారని…. అలాంటి వాళ్ళు అవసరమైతే కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పనిచేయాలని హెచ్చరించారు. మా ఎమ్మెల్యే ఆదివాసీ బిడ్డ కోవ లక్ష్మిపై కూడా అక్రమంగా కేసు పెట్టారు. నిజాయితీగా పార్టీ పని చేసి, ప్రజాస్వామికంగా ప్రజల తీర్పును గౌరవించేలా కాపాడుకోవడమే ఆమె చేసిన తప్పా? ఇలా అడ్డగోలుగా అక్రమ కేసులు పెడుతున్న ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో శిక్ష అనుభవించక తప్పద‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like