ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య…
Basara IIIT:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్. వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలికల వసతి గృహంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వసంత ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.