అకాల వర్షాలతో పంట నష్టం
ప్రాథమిక అంచనాలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటల నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా సుమారు 5,000 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతి పంట పొలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేయాలని ఆమె సూచించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతుల వివరాలను త్వరితగతిన నమోదు చేసి, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.