యథారాజా… తథా మంత్రి..
రేవంత్ సర్కార్‌పై బాల్క సుమన్ నిప్పులు!
Balka Suman:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధర్యంలో రాష్ట్రమంతటా పరిస్థితి దారుణంగా తయారయ్యిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదల అనంతరం విలేకరులతో మాట్లాడారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్, ఆయన కొడుకు ఎంపీ వంశీకృష్ణ 14 మంది కౌన్సిలర్లను కొనే ప్రయత్నం చేశారని అన్నారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఆఫర్లు చేసారని.. అయినా తమ వాళ్ళు తలొగ్గలేదన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి, ఎంపీ… ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లకు మందు తాగించి వాళ్ళతో తమ మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చూపించారని మండి పడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు.
ఇక అక్కడ గొడవ సందర్భంగా రాళ్లు విసిరినోళ్ళ మీద కేసులు బుక్ కాలేదని… మా 25 మంది మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ చార్జి చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే.. మాపైనే రివర్స్‌లో కేసు పెట్టారని మండిపడ్డారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. జిల్లాలోని కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జైలు లోపల కూడా తమను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. నిన్న హోలీ, ఇవాళ నా కొడుకు పుట్టిన రోజు.. ఈ టైమ్‌లో నన్ను ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. అందర్నీ కలుపుకుపోయాం తప్ప.. కక్ష సాధింపు చేయలేదని స్పష్టం చేశారు. నన్ను జైలులో పెట్టారు కదా.. ఇప్పుడు కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నా అని అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జైల్లో పెట్టారు గా కడుపు మంట తగ్గింది అనుకుంటున్నానని బాల్క సుమన్ స్పష్టం చేశారు. క్యాతన పల్లి ఎన్నిక సవ్వంగా నిర్వహించాలన్నారు. విలేకరుల సమావేశం ముగించుకుని ఆయన నేరుగా క్యాతన్‌పల్లి వెళ్లారు. అంతకుముందు ఆయన జైలు నుంచి విడుదల అయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు.