ఇందిర‌మ్మ ఇండ్ల పండుగ

-కొత్త‌గా ఇండ్ల కోసం ఎదురుచూసే వారికి ప్ర‌భుత్వం గుడ్ న్యూస్
-ఏప్రిల్‌లో కొత్త ఇండ్ల‌ మంజూరుకు రంగం సిద్ధం
-ఇప్ప‌టి వ‌ర‌కు 20 శాతం మాత్రమే గ్రౌండింగ్‌...
-డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల‌పైనా ప్రత్యేక దృష్టి
-పూర్త‌యిన వాటికి మార్చి 31లోపు ల‌బ్ధిదారుల ఎంపిక

Indiramma Houses Scheme:తెలంగాణలో కొత్త ఇందిరమ్మ ఇండ్ల‌ కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖ‌రారు చేసింది. ఈ నెలాఖరు నాటికి గ‌తంలో మంజూరు చేసిన ఇండ్ల‌కు సైతం గృహప్రవేశాలు చేసేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. డ‌బుల్ బెడ్‌రూంల గురించి కూడా ప్ర‌త్యేక చొర‌వ చూపుతోంది. గత ప్రభుత్వం వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

ప్ర‌భుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు మంజూరు చేస్తుంద‌ని తెలంగాణలో చాలామంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌లో కొత్త ఇండ్లు మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. ప్రభుత్వం తొలి విడతలో 3.60 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. స్థలం ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఇండ్ల నిర్మాణం బట్టి వీటిని లబ్దిదారుల అకౌంట్లో నేరుగా జమ చేస్తోంది. సుమారు 3 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 52 వేల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేసేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ప్రస్తుతం తొలి దశలో మంజూరు చేసిన ఇళ్లన్నీ గ్రౌండింగ్ పూర్తి చేసేల ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

20 శాతం మాత్రమే గ్రౌండింగ్‌…
అయితే, ఇప్పటివరకు కేవలం 20 శాతం ఇండ్లు గ్రౌండింగ్ పూర్తి అయ్యాయి. మార్చి 31లోపు ఇళ్లన్నీ గ్రౌండింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ చివరి నాటికి ఇళ్లన్నీ పూర్తయ్యేలా లబ్దిదారులను ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లను జూన్ చివరినాటికి పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో లబ్ధిదారులపై భారం పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. అటు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోపు డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల‌పై ప్రత్యేక దృష్టి
గత ప్రభుత్వం వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల‌ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పటికే 1.62 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 1.54 లక్షల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. వాటికి లబ్ధిదారులను మార్చి 31లోగా ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేటప్పుడు.. స్థలం లేని పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌లో 28 వేల మంది లబ్ధిదారులను మార్చి చివరికల్లా గుర్తిస్తారు. అసంపూర్తి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి ల‌బ్ధిదారుల‌కు అందజేయ‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like