వదంతులను నమ్మకండి
SP Sirisetty Sankeerth:ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొంతమంది దళారులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇతర నిత్యావసర సరుకులు కొరత ఏర్పడుతాయని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. భూపాలపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇతర నిత్యావసర సరుకులు సరిపడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎలాంటి వదంతులను నమ్మి అవసరానికి మించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు.. ఇతర నిత్యావసర సరుకులు నిల్వ చేసుకోవద్దని జిల్లా ప్రజలను కోరారు.
అవసరానికి మించి సరుకులు నిల్వ చేయడం, అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలు నిత్యావసర వస్తువుల చట్టం (Essential Commodities Act) కింద నేరం అని ఎస్పీ వెల్లడించారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.అందువల్ల జిల్లా ప్రజలు ఎలాంటి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపారు. ప్రశాంతంగా ఉండి, అవసరమైనంత మాత్రమే నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలని ఎస్పీ సంకీర్త్ విజ్ఞప్తి చేశారు.