క్యాతనపల్లి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య సూచించారు. శనివారం (ఏప్రిల్ 4)న నిర్వహించనున్న ఎన్నికల దృష్ట్యా క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం, ఎన్నికల వేదికలను ఏసీపీ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో అవాంతరాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లకు ఎన్నికల నోటీసులను సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సిలర్లకు కూర్చునేందుకు… భద్రతా ఏర్పాట్లు ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఎన్నికల సజావుగా జరిగేలా వేదిక, మైక్ వ్యవస్థ, రికార్డు నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల వేదిక పరిసర ప్రాంతాలలో బారికేడింగ్‌ను సక్రమంగా ఏర్పాటు చేసి అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించి రాకపోకలు సులభంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసి, ఎలాంటి లోపాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని తెలిపారు.
చట్టం–శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఏసీపీ, సీఐలు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎటువంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య ఆదేశించారు.