క్యాతన్‌పల్లి కారుదే… చేతులెత్తేసిన కాంగ్రెస్…
Kyathannapalli Municipal Elections:ఎంతో ఉత్కంఠ రేపిన క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠం ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్‌కు చెందిన గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐకి చెందిన మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో 22 సీట్లు ఉన్నాయి. ఇందులో సీపిఐతో కలిసి బీఆర్ఎస్ 14 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 7 సీట్లకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే మ్యాజిక్ ఫిగర్ ఉన్న కారు పార్టీ క్యాతన్‌పల్లి సీటు కైవసం చేసుకుంది. అదే సమయంలో పొత్తు ధర్మంలో భాగంగా సీపీఐకి వైస్‌చైర్‌పర్సన్ పదవి కట్టబెట్టింది.
చేతులెత్తేసిన కాంగ్రెస్..
ఈ మున్సిపల్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. వాస్తవానికి ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది. చివరికి ఈ రోజు నిర్వహించిన ఎన్నిక నేపథ్యంలో కేవలం ఏడు సీట్లు మాత్రమే ఉన్నందున కాంగ్రెస్ సైలెంట్ అయ్యింది. బీఆర్ఎస్, సీపీఐ నేతలను తమ వైపు తిప్పుకోవాలని భావించినా ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గ చూపలేదు. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మంత్రి వివేక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కౌన్సిలర్లు ససేమిరా అనడంతో కాంగ్రెస్ నేతలు కాడిపడేశారు.
క్యాంపు నుంచి నేరుగా కార్యాలయానికి…
చైర్మన్, వైస్ చైర్మన్ గతంలో వాయిదా పడటంతో ఆప్ర మత్తమైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ తోపాటు మిత్రపక్షమైన సీపీఐ సభ్యులు 14 మందిని క్యాంపునకు తరలించారు. అప్పటి నుంచి వారంతా క్యాంపులోనే ఉండగా, శనివారం కరీంనగర్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మునిసిపల్ కార్యాలయంలో జరుగనున్న ఎన్నికకు తిరిగి వచ్చారు.
పోలీసుల గట్టి బందోబస్తు…
మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘట నలు జరగకుండా మునిసిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో బీఎన్ ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తోంది. ఇందులో బా గంగా మునిసిపల్ కార్యాలయం ఆవరణతోపాటు, పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 800 సిబ్బందిని ఎన్నికల కోసం నియమించారు.