సింగరేణిలో రాజకీయ దోపిడీ పునాదులు పెకలించాలి
-బొగ్గు, విద్యుత్తు బకాయిలు వసూలు చేయకపోవడం దుర్మార్గం
-సింగరేణి నష్టాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలి
-కారుణ్య నియామకాలు ఆపే అధికారం ఎవరికీ లేదు
-సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్
Singareni:సింగరేణిలో రాజకీయ దోపిడీ పునాదులు పెకలించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆయన అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. కార్మికులు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ఏఐటీయూసీ (AITUC), ఐఎన్‌టీయూసీ (INTUC) సంఘాలు వారిని పట్టించుకోవడం మానేశాయని దుయ్యబట్టారు. ఐక్య పోరాటాలకు నాయకత్వం వహించాల్సిన ఆ సంఘాలు… రాజకీయ అవసరాల కోసం, కార్మికులకు అన్నం పెట్టే సంస్థను ముంచుతున్న అవినీతి రాజకీయ నాయకులకు వంతపాడటం కార్మికుల దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ స్వయం పరిపాలన కోసం, మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాల కోసం సాగించిన పోరాట ఫలితమే నేటి కారుణ్య నియామకాలని అప్పాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మెడికల్ బోర్డు ద్వారా జరిగిన నియామకాల్లో రాజకీయ బ్రోకర్లు, కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడి జేబులు నింపుకున్నారనేది జగమెరిగిన సత్యమన్నారు. అనారోగ్యం బారిన పడి కుటుంబ పోషణ భారమైన కార్మికుల పిల్లలకు (డిపెండెంట్స్) ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని వెల్లడించారు. ఖాళీలు లేవనే కుంటిసాకులతో ఉద్యోగాలను నిలిపివేయడం క్షమించరాని నేరమని… దీనిని బీఎంఎస్ (BMS) తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం ఎవరి దయాదాక్షిణ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఇది యాజమాన్యాల బాధ్యత అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అప్పని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందన్నారు. అవుట్‌సోర్సింగ్ టెండర్లు, అధికారుల బదిలీలు, పర్చేస్ ఆర్డర్లు, చివరకు DMF, CSR నిధుల కేటాయింపుల్లో కూడా రాజకీయ నాయకుల హస్తం ఉండటం వల్లే సింగరేణిలో పరిపాలన దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ రాజకీయ అవినీతిని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు.
2012లో ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ. 3,670 కోట్లని, 2014 నుండి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆ బకాయిలు రూ. 30,286 కోట్లకు చేరాయన్నారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్లలో సుమారు రూ. 20,000 కోట్ల పైచిలుకు విద్యుత్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి సింగరేణిని లూటీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి లాంటి సింగరేణిని రాజకీయ శక్తులు చెరబడుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత కార్మిక బిడ్డలపై ఉందని స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు కోసం, కార్మిక హక్కుల కోసం బీఎంఎస్ (BMS) చేస్తున్న పోరాటాలకు కార్మికులందరూ కలిసి రావాలని అప్పని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
పిట్ సెక్రటరీ మీనుగు సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బీఎంఎస్ కోశాధికారి హరిన్, సెంట్రల్ సెక్రటరీ ఈముల సత్యనారాయణ, ఆర్జీ-3 ఉపాధ్యక్షులు అరుకాల ప్రసాద్, పెన్షనర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలయ్య, కాంట్రాక్టు మజ్దూర్ సంఘ్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్, ఏరియా సహాయ కార్యదర్శి జాడి వెంకటేష్, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ ఉష్కమల్ల వంశీ, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ కందుల మహేష్, షిఫ్ట్ ఇన్ చార్జీలు రాయనవేణి రమేష్,గాజువేనా తిరుపతి,రస్నారి అరుణ్,అంజి,వెంకట్ సాయి, కార్మికులు పాల్గొన్నారు.