మ‌హారాష్ట్రలో పులి దాడి… న‌లుగురు మ‌హిళల మృతి

Tiger attack in Maharashtra… Four women killed: మహారాష్ట్ర రాష్ట్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది. చంద్రపూర్ జిల్లా జిల్లాలోని గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం బీడీ ఆకులు ఏరుకునేందుకు వెళ్లిన నలుగురు మహిళలపై పులి ఒక్కసారిగా దాడి చేసి చంపింది. ఈ ఘటనతో సిందేవాహి తాలూకా పరిసర గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో గ్రామీణ ప్రజలు ప్రతి రోజూ ఉదయం పెద్ద సంఖ్యలో అడవికి వెళ్లి బీడీ ఆకులు సేకరిస్తుంటారు. శుక్రవారం ఉదయం కూడా గంజేవాహి ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు అడవిలోకి వెళ్లారు. ఉదయం సుమారు 8 గంటల సమయంలో మాటువేసి ఉన్న పులి అకస్మాత్తుగా వారిపై దాడికి దిగింది.

బాధితులకు తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పులి అత్యంత భీకరంగా విరుచుకుపడింది. ఈ దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కవుదుబాయి దాదాజీ మొహర్లే (45), అనుబాయి దాదాజీ మొహర్లే (40), సునీతా కౌశిక్ మొహర్లే (38), సంగీతా సంతోష్ (50)గా గుర్తించారు. వీరంతా గంజేవాహి గ్రామానికి చెందినవారేనని అధికారులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ రేంజ్ అధికారి అంజలీ సాయంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

ఒకేసారి పులి దాడిలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామీణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అట‌వీ ప్రాంతాల సమీప గ్రామాల్లో భయం నెలకొనగా, స్థానికులు వెంటనే చర్యలు తీసుకుని పులిని అదుపులోకి తీసుకురావాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. తునికి ఆకుల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరుసగా జరుగుతున్న పులి దాడులతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. అట‌వీ సమీప గ్రామాల్లో భద్రతా చర్యలు పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

You might also like