రైతుల‌కు చ‌ల్ల‌ని వార్త‌… పుంజుకున్న రుతుప‌వ‌నాలు

Monsoon:క‌రువు ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని, ఎల్‌నినో ప్ర‌భావంతో ఈ ఏడు వ‌ర్షాలు త‌క్కువ ఉంటాయ‌ని చెప్ప‌డంతో డీలా ప‌డ్డ రైతుల‌కు ఇది నిజంగా చ‌ల్ల‌ని వార్తే… ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా మారిన రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. ఈ నెల 21న తిరిగి పుంజుకొని పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమై, 23 నాటికి రాష్రమంతా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

ముందుగానే దేశంలోకి అంటే జూన్ 4న రుతుప‌వ‌నాలు వ‌చ్చేశాయి. అయితే, ఆ తర్వాత ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల గమనం నిలిచిపోయింది. దీనివల్ల దేశంలో వర్షపాత కొరత ఏర్పడింది. ఇది అటు వ్యవసాయ రంగానికి, అటు నీటి నిల్వల నిర్వహణపై తీవ్ర ఆందోళన కలిగించింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో చురుగ్గా సాగాల్సిన రుతుపవనాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో రైతులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కేవలం ఎల్ నినో కారణం వల్లే కాకుండా, వివిధ భౌగోళిక వ్యవస్థల సంక్లిష్ట పరస్పర ప్రభావం వల్లే రుతుపవనాలు ముందుకు సాగకుండా తీవ్ర స్తబ్దత ఏర్పడింది. పసిఫిక్ మహాసముద్రంలో తలెత్తిన ఆటంకాలు, ఉత్తర భారత్ మీదుగా మోసుకొచ్చిన పశ్చిమ అల్లకల్లోలాలు (వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్), చురుగ్గా లేని వాయువ్య ద్రోణి దీనికి కార‌ణ‌మ‌ని వాతావార‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర సరిహద్దు హైదరాబాద్‌, భద్రాచలం ప్రాంతాల చుట్టుపకల నిలిచిపోయాయని, వాతావరణంలో మార్పులతో నాలుగు రోజుల్లో మిగిలిన జిల్లాల్లోకి ప్రవేశించి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో సగటున 30 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యం గా నిజామాబాద్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో 60 నుంచి 80 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. ఈ నెల 21న (ఆదివారం) తిరిగి పుంజుకొని పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమై, 23 నాటికి రాష్రమంతా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎంజెఓ త్వరలోనే బలమైన అనుకూల దశలోకి ప్రవేశించనుంది. దీనికి తోడు వాతావరణ ఎగువ పొరల్లో తూర్పు పవనాలు కూడా వేగంగా బలపడనున్నాయి. ఈ మార్పుల వల్ల పొడి గాలుల ప్రభావం క్రమంగా తగ్గిపోయి, నైరుతి రుతుపవనాలు దేశమంతటా తిరిగి చురుగ్గా పురోగమించేందుకు మార్గం సుగమం కానుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like