ఇక రైతు ఆవేదన యాత్ర..!
19 నుంచి వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ప్రారంభం
ఏ పంట వేయాలో తెలియక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయిన రైతులకు మా పార్టీ తరఫున భరోసా ఇస్తాం.. ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడతాం. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరి ఇంటికీ వెళ్తాం. వారి కుటుంబాలను పరామర్శిస్తాం
– వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల
తెలంగాణలో రాజకీయంగా మరింత దూకుడు పెంచుతున్నారు వైఎస్ షర్మిల.. ఈ నెల 19 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఆమె ఈ యాత్ర చేపడుతున్నారు.
రైతు సమస్యలే ప్రధానాస్త్రం..
తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ వైఎస్ శర్మిల ఈ యాత్ర చేపడుతున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్య పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులెవరూ ఆత్మహత్య చేసుకోకూడదని విజ్ఞప్తి చేశారు.ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇంటింటికీ వెళ్లి పరామర్శిస్తానని చెప్పారు. తమ పార్టీ రైతు పక్షాన నిలబడుతుందని తెలిపారు. రైతులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తాను యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి రైతులపై శ్రద్ద లేదని ఆరోపించారు.
అధికార పార్టీపై విమర్శలు..
తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ తనయ వైఎస్ శర్మిల పార్టీ మొదలు పెట్టిన నాటి నుంచి అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలోని ప్రజలెవరూ టీఆర్ఎస్ పాలన పట్ల సంతృప్తిగా లేరని ఆరోపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే తాను వచ్చానని చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగానే తాను తెలంగాణలో పార్టీ పెట్టానని తెలిపారు. తన పార్టీ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని తెలిపారు. తన పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు స్థానం ఉంటుందని చెప్పారు.
పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు..
వైఎస్ శర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి దాని బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే పలు జిల్లాలో సభలు నిర్వహించారు. తన కలిసి నడిచే నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు దూరంగా ఉండే నాయకులను కలుపుకుపోతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఆక్టోబర్ 20వ తేదీ నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరిట యాత్ర చేపట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చిన పాదయాత్ర చేపట్టిన చేవెళ్ల ప్రాంతం నుంచే శర్మిల కూడా పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర చేవెళ్లలోనే ముగియనుంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్యలో తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా మళ్లీ యాత్ర చేపట్టనున్నారు. ఇటీవలే వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆమె ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆమె రైతు ఆవేదన యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర తరువాత ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగిస్తానని తెలిపారు.