ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత హెచ్చ‌రించారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామ శివారులో గల 79, 80 సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ భూమిని కాగజ్ నగర్ రాజస్వ అధికారి చెన్నూరి కిష్టయ్య, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కాపు వాడలో ఓ వ్యక్తి రహదారిని ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నాడని, ఓ వెంచర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని ప్లాట్లు చేశారని వచ్చిన ఆరోపణలపై అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు హద్దులు నిర్ధారించి స్వాధీనం చేసుకోవాల‌ని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ మధుకర్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

You might also like