విద్యార్థులకు నాణ్యమైన విద్య

రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌ని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం చెన్నూర్ లోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామ‌ని అన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలలో నాణ్యమైన విద్య అందించనున్న‌ట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు, మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన తాగునీరు, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్న‌ట్లు చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని మంత్రి కోరారు. కార్య‌క్ర‌మంలో గిరిజన సంక్షేమ అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్మన్ పెద్దింటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

You might also like