ఆపత్కాలంలో ఆపద్భందువులా…
హైదరాబాద్ : అతను వారికి ఎవరికీ ఏమీ కాడు… కానీ వారికి సమయానికి భోజనం అందిస్తాడు. కరోనా బారిన పడిన వారికి ఆయన ఆపద్భందువులా నిలుస్తున్నడు… తన సొంత ఖర్చులతో వందలాది మంది కరోనా పేషెంట్లకు భోజనం అందిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై ప్రత్యేక కథనం…
ఆపదలో ఆపన్న హస్తం అందిస్తున్నారు కొందరు వ్యక్తులు. కరోనా టైంలో అయినవాళ్లు ఆదుకోకపోయినా మేమున్నం అంటూ ముందుకొస్తున్నారు. వైరస్‌బారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న పేషెంట్ల అవసరాలు తీరుస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న పేషెంట్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఫుడ్. ఇంట్లో వండుకోవడానికి సరుకులు లేకపోవడం, ఉన్నా చేసుకునేందుకు ఓపిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పేషెంట్ పేరు, అడ్రెస్ చెప్తే ఆర్గనైజేషన్ల వాళ్లే డోర్ డెలివరీ చేస్తున్నారు. ఒక ఇంట్లో నలుగురుకి వైరస్ సోకినా అందరికీ రెండు పూటల మీల్స్ అందిస్తున్నారు.
ఈ కోవకే చెందిన వారు భార్గవ్ వేంట్రాప్రగడ. ఆయన టై హైదరాబాద్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈవెంట్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గత ఏడాది కోవిడ్ సమయంలో తమకు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నామని బంధువులు ఫోన్ చేయడంతో ఆయన ధైర్యం చేసి కొందరికి భోజనాలు అందించారు. అది ఆ నోటా, ఈ నోటా పాకడంతో ఆయనకు పెద్ద ఎత్తున ఫోన్లు రావడం మొదలైంది. దీంతో ఆయన ప్రతి రోజు వందలాది మందికి భోజనాలు అందించడం మొదలు పెట్టారు. ఇలా ప్రతి రోజు 150 నుంచి 200 మందికి ఫుడ్ డెలివరీ చేశారు. ఇలా కోవిడ్ సెకండ్ వేవ్‌లో 35 వేల మందికి భోజనాలు సరఫరా చేశారు.
ఇప్పుడు కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ తన సర్వీసు ప్రారంభించారు భార్గవ్. మియాపూర్, జేపీ నగర్, శ్రీవాణినగర్ (మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన), బాచుపల్లి, అమిన్‌పూర్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో ఆయన స్నేహితుల సాయంతో కరోనా బాధితులకు భోజనం అందిస్తున్నారు. తన తల్లి రోజా, భార్య ఉమామహేశ్వరి ఇద్దరు ఉదయమే వంట చేస్తారని చెప్పారు భార్గవ్. మరి డబ్బులు ఎలా అని ప్రశ్నిస్తే తనకు ఉన్న ఏడు లక్షల సేవింగ్స్ తీసి వాటితో సేవ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలా తన వంతుగా ముందుకు వచ్చి బాధితులకు సేవ చేస్తున్న భార్గవ్ నిజంగా అభినందనీయుడే…
ఆయన సేవలు వినియోగించుకోవాలనుకున్న వారు 8886686000 నంబర్‌లో సంప్రదించవచ్చు.