మరో నిరుద్యోగి ఆత్మహత్య
మహబూబాబాద్: ఉద్యోగం కోసం వేచి చూసి మరో విద్యార్థి తనువు చాలించాడు. నా చావుకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపిస్తూ మహాబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ (25) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన వాట్సాప్ స్టేటస్‌లో నా చావుకు కేసీఆరే కారణమంటూ ఖమ్మం రైల్వేస్టేషన్లో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నిరుద్యోగం వల్ల మానసికంగా కుంగిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన సాగర్.. కరోనా మహమ్మారి కూడా తన చావుకు కారణమని పేర్కొన్నాడు. రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. 2019లో డిగ్రీ పూర్తి చేసిన సాగర్ పోలీస్ ఉద్యోగం కోసం కొన్ని సంవత్సరాలుగా కోచింగ్ తీసుకుంటున్నట్లు మృతుని తల్లిదండ్రులు తెలిపారు. సాగర్.. భద్రమ్మ, కలమ్మ దంపతులకు ఒక్కడే కుమారుడు కావడంతో కార్పొరేట్ కాలేజ్‌లో చదివించారు. చేతికి అందిన కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం చేసి తమను సాకుతాడని ఎదురు చూస్తున్న వీరికి కుమారుడి మరణవార్త తెలియడంతో బోరున విలపిస్తున్నారు.