ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. యుద్ద విమానాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భయానక వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ దేశంలో ఉన్న భారతీయ పౌరుల్ని తీసుకువచ్చేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన ఎయిరిండియా ప్రత్యేక విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది. దీంతో వేలాది మంది భారతీయు విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.
యాదాద్రి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు గంజి భానుప్రసాద్, శేషఫణిచంద్ర ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. రాజధాని కీవ్ ఎయిర్పోర్ట్ను రష్యా సైనికులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఈ విద్యార్థులు జాఫ్రోజీ కాలేజీలో తలదాచుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన జాలి ప్రణయ్కుమార్రెడ్డి వైద్య విద్యను ఉక్రెయిన్లో అభ్యిసిస్తున్నాడు. ప్రణయ్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రణయ్ అక్కడే చిక్కుకున్నాడు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కోరాయి. ఎప్పటికప్పుడు విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుతూ అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి. ఉక్రెయిన్లోని భారత ఎంబసీ అధికారులను ఎప్పటికప్పుడు.. సంప్రదింపులు జరుపుతున్నామని, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని తాము కూడా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో సంబంధిత అధికారులు ఉక్రెయిన్లోని తెలుగు విద్యార్థుల చిరునామాలను సేకరిస్తున్నారు.