ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి..
ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మరణించారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన నవీన్ ఓ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజు కూడా ఓ విద్యార్థి ఉక్రెయిన్‌లో అనారోగ్యంతో మరణించారు.
ఉక్రెయిన్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. బంకర్ల నుంచి అడుగు బయట పెట్టాలంటే ప్రాణాలను పణంగా పెట్టడంగా మారింది. ఖార్కివ్‌లో ఇలాగే బంకర్ నుంచి అడుగు బయట పెట్టి.. షాప్‌లో నిలుచున్న కర్ణాటకకు చెందిన నవీన్ ఎయిర్ స్ట్రైక్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా, ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మరణించాడు.
పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన 22 ఏళ్ల చందన్ జిందాల్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. ఆయన నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. చందన్ జిందాల్ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో వినీషియాలోని ఓ ఎమర్జెన్సీ హాస్పిటల్లో చేర్చారు. ఆయన ఐసీయూలో చికిత్స పొందారు. చందన్ జిందాల్ మెదడులో ఇస్కెమియా సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఆయన బుధవారం మరణించినట్టు సమాచారం.
ఫిబ్రవరి 2వ తేదీన జిందాల్ అనారోగ్యం బారిన పడగా.. జిందాల్ తండ్రి శిశన్ కుమార్, మామా క్రిష్ణ కుమార్‌లు ఈ నెల 7వ తేదీన ఉక్రెయిన్ వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు జిందాల్తోనే ఉన్నారు. బుధవారం జిందాల్ మరణించినట్టు తెలిసింది. చందన్ జిందాల్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి తండ్రి శిశన్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.