మెరుగైన సమాజ నిర్మాణం ఆమె చేతిలోనే
-కుటుంబ ఉన్నతికి జీవితాన్ని అంకితం చేసే త్యాగ శీలి మహిళే
-సింగరేణి భవన్ లో మహిళా దినోత్సవ వేడుకల్లో జీఎం(కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ
మహిళలు తమ వ్యక్తిగత సంతోషాల కన్నా కుటుంబ సభ్యుల ఆనందమే మిన్నగా భావిస్తారని, కుటుంబ ఉన్నతే తమ పురోగతి అన్న సంకల్పంతో తమ జీవితాలను త్యాగం చేసే గొప్ప సహనశీలి మహిళ అని జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ కొనియాడారు. ఆదివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అయినా కుటుంబానికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచానికి భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జీఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్) జి.సురేందర్ మాట్లాడుతూ అమ్మగా, చెల్లిగా, ఆలిగా, స్నేహితురాలిగా మహిళలు మన జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. వారిని గౌరవించుకోవడం బాధ్యత అన్నారు. వారి పట్ల వివక్షను విడనాడాలని కోరారు. కార్యక్రమంలో బొగ్గు గని అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖర్ రావు మాట్లాడుతూ.. మైనింగ్ రంగంలోనూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని గుర్తు చేశారు. దేశ ఆర్థికాభివృద్ధి లో మహిళా మేధోశక్తి ఎంతో దోహదపడుతుందని కొనియాడారు లా మేనేజర్ శిరీషా రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని లింగ సమానత్వం సాధించాలన్న ఇతివృత్తంతో జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గుడిపాటి సులోచన సురేందర్, సీనియర్ ప్రోగ్రామర్ షర్మిలా మోజెస్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లక్ష్మీ ప్రియ తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మహిళా దినోత్సవం నేపథ్యంలో వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు జీఎం(కో ఆర్డినేషన్)సూర్యనారాయణ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమానికి సమన్వయకర్తలుగా శారద వ్యవహరించగా, సీనియర్ కమ్యూనికేషన్ అధికారి గణాశంకర్ పూజారి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.