అందుకే నా కూతురిని కూడా తీసుకుపోతున్న
తాను లేకపోతే తన కూతురి జీవితం కూడా నాశనం అవుతుందని, ఆ చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒక తండ్రి.. వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కుమార్తెతో సహా లాడ్జి భవనం మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్ లింగంపల్లికి చెందిన చెరుకూరి సురేష్ (40) అనే వ్యక్తి తన కూతురు శ్రేష్ఠ (6)తో కలిసి గురువారం యాదగిరిగుట్టకు వచ్చారు. మయూరి లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అదే భవనం పైనుంచి కూతురితో సహా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సురేష్ అద్దెకు తీసుకున్న గదిలో సూసైడ్ నోట్ గుర్తించారు. కుటుంబ కలహాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను లేకపోతే కూతురి జీవితం నాశనమవుతుందన్న ఆందోళనతో తనతో పాటే తీసుకెళ్లిపోతున్నానని సురేష్ లేఖలో రాశాడు. రెండు మృతదేహాలను పోలీసులు భువనగిరి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట పోలీసులు తెలిపారు.