బాధిత మహిళలకు అండగా సఖి
సఖి కేంద్రం లీగల్ కౌన్సిలర్ శైలజ
మంచిర్యాల : సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు అండగా సఖి కేంద్రం ఉంటుందని లీగల్ కౌన్సిలర్ శైలజ అన్నారు. తాండూరు మండలం బోయపల్లి, ద్వారకాపూర్‌లో సఖి కేంద్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సఖి కేంద్రం సేవలను వినియోగించుకోవాలని కోరారు. గృహహింస, వరకట్నం, భర్త, అత్త, మామ, ఆడపడుచు వేధింపులు, ఆస్తి వివాదాలు, బెదిరింపులు తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. 181కి డయల్ చేస్తే వెంటనే బాధిత మహిళలకు సాయం అందుతుందన్నారు. 24 గంటలపాటు ఈ టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. బాధితులు ఫోన్ చేయగానే.. పోలీసులు, అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని కౌన్సెలింగ్ ద్వారా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. ఫిర్యాదుదారురాలి విషయాలు గోప్యంగా ఉంచుతారని వెల్లడించారు. మానసిక ఆందోళనకు గురువుతున్న వారికి అవసరం అనుకుంటే చట్టపరమైన సాయం కూడా అందిస్తారని అన్నారు. నిరాదరణకు గురై నీడలేని మహిళలను స్టే హోమ్స్, సదరం హోమ్స్‌కు పంపిస్తారని, ఎవరైనా వసతి కావాలంటే తాత్కాలిక సాయం చేయడంతోపాటు విడిది కూడా ఏర్పాటు చేస్తారని చెప్పారు. బాధిత మహిళలకు సఖి కేంద్రం ఎంతో భరోసా ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ కౌన్సిలర్ శైలజతో పాటు వసంతలక్ష్మి, బోయపల్లి సర్పంచ్ సునీత, ద్వారకాపూర్ సర్పంచ్ సత్తమ్మ, అంగన్వాడీ టీచర్లు అమృత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.