ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువకుడి ఆత్మహత్యాయత్నం
టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వేధింపులు భరించలేక ఓ యువకుడు ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన ఆవులసంతోష్ 170 సర్వేనెంబర్ లోని ఇల్లు కట్టుకున్నాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంతోష్ తల్లి వికలాంగురాలు కావడంతో ఆమెకు ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు తన ఇల్లు, స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు కార్యాలయంలో సోమవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే క్యాంపు కార్యాలయంలో ఉన్న కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు ఆ వ్యక్తిని అడ్డుకొని పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అనంతరం సంతోష్ ఒంటిపై నీళ్లు చల్లారు. తన ఇంటిని, స్థలాన్ని టిఆర్ఎస్ పార్టీకి చెందిన దయాకర్,నవీన్,కార్తీతో పాటు మరికొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను డ్రైవర్‌గా పనిచేస్తూ ఎంతో కొంత కూడబెట్టుకున్న సొమ్ముతో ఇల్లు కట్టుకున్నానని తెలిపారు. కొందరు టిఆర్ఎస్ నాయకులు కొన్ని రోజులుగా తన స్థలం తో పాటు ఇంటిని కబ్జా చేసుకునేందుకు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఆదివారం భార్యా పిల్లలను సైతం ఇంటి నుండి గెంటేశారని ఆరోపించారు. తనకు సత్వర న్యాయం జరగాలని ఉద్దేశంతోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చానని స్పష్టం చేశాడు.