ఇదేనా ప్రభుత్వ వైద్యం…?
-డాక్టర్ల తీరుపై ఏఐసీసీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం -మంత్రి ఇలాకలోనే ఇంత దారుణమా..?
నిర్మల్ :నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పేద ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంగ్వాపేట్ కు చెందిన ప్రేమలత అనే మహిళ ప్రమాదంలో గాయపడగా ఆమెను పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లారు, ఆ సమయంలో డాక్టర్లు ఎవరు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రజా వైద్యశాలలో ఒక్క వైద్యుడు కూడా డే టైంలో అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం, జిల్లా హెడ్ క్వార్టర్ లోనే పరిస్థితి ఇలా ఉంటే మండలాలలో phcల పరిస్థితి ఎలా ఉందో..? అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి అసహనం వ్యక్తం చేశారు.
అస్పత్రిలో డ్యూటీ లో ఉండాల్సిన డాక్టర్లు ఎక్కడకు వెళ్లి పోయారంటూ ప్రశ్నించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఆస్పత్రులు, ప్రజా సమస్యల కంటే, కబ్జాలు, కమీషన్లు వచ్చే పనులనే పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. మంత్రి పాలనలో వ్యవస్థలను భ్రష్ఠు పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆస్పత్రిలో రోగులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, డాక్టర్లు 24 గంటల పాటు డ్యూటీ టైం అందుబాటులో వుండాలని సూచించారు. ఆస్పత్రికి వెళ్లి, పరిస్థితి చూసి, సూపరింటెండెంట్ కు ఫోన్ చేసిన 30 నిమిషాల తర్వాత ఒక డాక్టర్ వచ్చారంటే, ఎమర్జెన్సీ కేసులు వస్తే పరిస్థితి ఎలా అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు డ్యూటీలు చేయకుండా సొంత క్లినిక్లు పెట్టుకుని దందా చేస్తున్నారని మండి పడ్డారు. పాలకుల నిర్లక్ష్యంతోనే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.