ప్రజలకు కడుపు నిండుతోంది.. వాళ్ల కండ్లు మండుతున్నాయి..
-గత ప్రభుత్వాల హయంలో దరఖాస్తులు, దండాలే.. మంత్రి గంగుల -రామకృష్ణాపూర్ పట్టణ పునర్జీవం నా లక్ష్యం : విప్ బాల్క
మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలకు కడుపు నిండుతోందని, ప్రతిపక్షాల కండ్లు మాత్రం మండుతున్నాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగులకమలాకర్ అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో కలిసి సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వేరే ఏ రాష్ట్రంలో అందించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు అని స్పష్టం చేశారు.
పండగలాంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడంలో ఎంతో ఆనందంగా ఉందని మంత్రి వెల్లడించారు. జీవో 76 కోసం బాల్క సుమన్ పోరాటం చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఇండ్ల పట్టాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా సుమన్‌ను అభినందించారు. సింగరేణి భూముల క్రమబద్ధీకరణ చేయమని సమైక్య పాలనలో ఎంత మొత్తుకున్నా కనికరించలేదని, గత ప్రభుత్వాల హయాంలో దరఖాస్తులు.. దండాలతో ప్రజలు విసిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి కళ్ళు, కడుపు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తిరిగి ఆంధ్రలో కలుపుతామని అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే బాల్కసుమన్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా కోరారు.
ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం క్యాతనపల్లి మున్సిపాలిటీకి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరమన్నారు. 2014 సింగరేణి ఎన్నికల మేనిఫెస్టులో ఇచ్చిన మాట నిలబెట్టు కున్నామని స్పష్టం చేశారు. ఇండ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయితే సుమారు 5000 మందికి పైగా మహిళలు లక్షాధికారులు కాబోతున్నారని తెలిపారు.
ఇండ్ల పట్టాలతో అప్పుల బాధ లేకుండా తక్కువ ఖర్చుతో సొంత ఇంటి నిర్మాణాలు కూడా చేసుకోవచ్చని వెల్లడించారు. రూ. 145.83 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అన్నీ పూర్తయితే గొప్ప పట్టణాలను తలదన్నేలా రామకృష్ణాపూర్ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ప్రతిపక్షాలకు కేసీఆర్ ను తిట్టడమే నినాదమైతే, టీఆర్ఎస్ పార్టీకి సంక్షేమమే విధానమన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు కలుషితం చేసి ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారని దుయ్యబ్ట్టారు. ఈ కార్యక్రమంలో జోగురామన్న, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ దండే విఠల్, రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి తదితరులు పాల్గొన్నారు.